భారత్ 2026 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ విజయాన్ని ముగింపు కాదని, ఇది టీమ్ ఇండియా ప్రయాణానికి ఆరంభమని ఆయన అన్నారు. భవిష్యత్తులో టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు సాధించడం భారత జట్టు లక్ష్యమని గంభీర్ వెల్లడించారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై ఫైనల్లో విజయం సాధించిన మరుసటి రోజు స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇకపై మరింత దూకుడుగా ఆడాలని ఆయన కోరారు.
ఈ టోర్నమెంట్‌లో భారత్ దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. జట్టులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారత్ విజేతగా నిలిచింది. హర్షిత్ రాణా జట్టుకు దూరమవడం, అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురవడం, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడం, ఫీల్డింగ్‌లో అనేక క్యాచ్‌లు మిస్ కావడం వంటి పరిస్థితులు ఉన్నా టీమ్ ఇండియా అద్భుతంగా పోరాడింది. మొత్తం టోర్నమెంట్‌లో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. అది సూపర్ ఎయిట్స్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్.
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ..ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. టీ20ల్లో ఇప్పటివరకు 300 పరుగుల మార్క్‌ను మేము చేరుకోలేదు. ఒక రోజు తప్పకుండా ఆ రికార్డును అందుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే మేము ఇంకా మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నాం అని అన్నారు.
కోచ్‌గా తన బాధ్యతల గురించి మాట్లాడుతూ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోచ్‌గా ఆటగాళ్లకు మంచి వాతావరణం కల్పించడం, భద్రతగా అనిపించేలా చేయడం, అనుభవాన్ని పంచుకోవడం చేయగలమని చెప్పారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఫలితాలు పూర్తిగా ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయని అన్నారు.
గౌతమ్ గంభీర్ ఇప్పటికే 2025 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 వరల్డ్ కప్‌ను గెలిపించిన తొలి భారత కోచ్‌గా నిలిచారు. ఇక ముందు 2027 వన్డే వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించడం తన ప్రధాన లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశారు. అలాగే 2028 ఒలింపిక్స్ వంటి భవిష్యత్ టోర్నమెంట్లను కూడా లక్ష్యంగా పెట్టుకుని టీమ్ ఇండియా ముందుకు సాగుతుందని తెలిపారు.
