భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు.
ఆయన మృతికి పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు.
1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడారు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేశారు. 1974లో రిటైరయ్యారు. టీమిండియా తొలి వన్డే కెప్టెన్‌గానూ వాడేకర్ రికార్డులకెక్కారు. ఆ మ్యాచ్‌లో 67 పరుగులతో రాణించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది.
క్రీడా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పౌర పురస్కారం ఇచ్చి గౌరవించింది. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. రిటైరైన తర్వాత అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత జట్టుకు మేనేజర్‌గా వాడేకర్ సేవలందించారు.
