భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో అరుదైన ఘనత దక్కింది. సొంతగడ్డపై వన్డేల్లో 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా ధోనీ రికార్డ్ సాధించారు. బుధవారం పుణేలో జరిగిన భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ధోనీ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ఇనింగ్స్ మూడో ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతికి కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ధోనీ ఖాతాలో సొంతగడ్డపై 200 క్యాచ్‌లు పట్టిన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు కుమార సంగక్కర(శ్రీలంక), అలెక్ స్టీవార్ట్(ఇంగ్లాండ్) మాత్రమే తమ తమ దేశాల్లో 200పైగా క్యాచ్‌లు పట్టి రికార్డు సాధించారు. ఈ జాబితాలో ధోనో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ అడమ్ గిల్‌క్రిస్ట్(417) టాప్‌లో ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్(402), శ్రీలంక ఆటగాడు సంగక్కర (383) ఉన్నారు. నాలుగో స్థానంలో ధోనీ (288) కొనసాగుతున్నాడు. ఇక పునే వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. ఇక ఈ నెల 29న కాన్పూర్ వేదికగా చివరి వన్డే జరగనుంది.
