Tuesday, May 14, 2024
- Advertisement -

భార‌త్‌కు లంక షాక్‌….ఓడిపోవ‌డానికి కార‌ణాలు ఇవే..

- Advertisement -

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భార‌త్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. వరుస తప్పిదాలతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. సీనియర్ క్రికెటర్ల స్థానంలో చోటు దక్కించుకున్న కుర్రాళ్లు.. ఫీల్డింగ్‌లోనూ తడబడటంతో సొంతగడ్డపై శ్రీలంక అసాధారణ రీతిలో 175 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (90: 49 బంతుల్లో 6×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక హిట్టర్ కుశాల్ పెరీరా (66: 37 బంతుల్లో 6×4, 4×6) దూకుడుగా ఆడటంతో శ్రీలంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ఆట మొదలైందో లేదో… భారత్‌ 2 వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ (0), రెండో ఓవర్లో రైనా (1) ఔట్‌. చమీర బౌలింగ్‌లో రోహిత్‌ కొట్టిన భారీ షాట్‌ను జీవన్‌ మెండిస్‌ అద్భుతంగా ఆదుకున్నాడు. రైనా నిర్లక్ష్యంగా వికెట్లను విడిచి ఆడగా… సూటిగా సంధించిన ఫెర్నాండో బంతి వికెట్లను కూల్చింది. దీంతో రైనా క్లీన్‌బౌల్డయ్యాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, మనీశ్‌ పాండే ఆదుకున్నారు.

ఇక బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం టీమిండియా ఘోరంగా విఫలమైంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కత్, శార్ధూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలర్ల స్పెల్ మార్పుపై పేలవరీతిలో నిర్ణయాలు తీసుకున్నాడు.

తొలి ఓవర్‌లోనే కఠినమైన బంతులు విసిరి.. లంక ఓపెనర్లని ఇబ్బందిపెట్టిన జయదేవ్ ఉనద్కత్‌కి.. మూడో ఓవర్‌లో అవకాశం ఇవ్వకుండా.. శార్ధూల్ ఠాకూర్‌కి బంతినిచ్చాడు. దీంతో.. ఆ ఓవర్‌లో కుశాల్ పెరీరా సంచలన రీతిలో వరుసగా 4 4, 4, 6, 4Nb, 4, 0 బాదేశాడు. దీంతో.. లంకేయుల్లో ఆత్మవిశ్వాసం పతాక స్థాయికి చేరిపోయింది. తర్వాత ఓవర్‌ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో గుణతిలక బాదిన భారీ సిక్సరే దానికి నిదర్శనం. ఇదే శ్రీల‌కం విజ‌యానికి నాంది ప‌లికింది.

అప్పటికే చేసిన తప్పుని గ్రహించిన రోహిత్.. ఐదో ఓవర్‌ని ఉనద్కత్‌తో వేయించగా.. ఆ ఓవర్‌లోనూ గుణతిలక ఓ సిక్స్, ఫోర్ బాదినా చివరి బంతికి అతను ఔటవడం విశేషం. మంచి లయతో ఉన్న ఉనద్కత్‌ని మూడో ఓవర్‌ బౌలింగ్ చేయించకుండా.. రోహిత్ శర్మ చాలా పెద్ద తప్పుచేశాడని మ్యాచ్ కామెంటేటర్లు సైతం పెదవివిరిచారు. ఫీల్డింగ్ సెట్ చేయడంలోనూ రోహిత్ విఫలయ్యాడు. రిషబ్ పంత్ ఓ క్యాచ్‌ని జారవిడచగా.. విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్‌లో తడబడ్డారు. శ్రీలంక హిట్టర్లు స్పిన్నరను లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేస్తుంటే.. వరుసగా వాషింగ్టన్ సుందర్, చాహల్, సురేశ్ రైనాలతో బౌలింగ్ చేయిస్తూ.. ఆల్‌రౌండర్ విజయ శంకర్‌ని పక్కన పెట్టడం విమర్శలకి తావిస్తోంది.

మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లేని లోటు భారత్‌లో స్పష్టంగా కనబడింది. శ్రీలంక హిట్టింగ్ చేస్తుంటే.. భారత బౌలర్లకి సలహాలు ఇచ్చేవారు కరవయ్యారు. రోహిత్ శర్మ కూడా మైదానంలో అసహనం కనిపించడం.. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -