ఓటుకు నోటు వ్యవహారంంలో అధినేతను రక్షించుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఓవర్ అయ్యాయి అని తెలుగుదేశం నేతలకు అర్థం అయ్యిందా? ఈ విషయంలో ఊరికే నోరు పారేసుకొంటే అనార్థాలే తప్ప.. అధినేత సేప్ అయ్యే అవకాశాలు లేవని వీరికి తెలిసిందా? అందుకే వారు పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలతో జనిస్తున్న సందేహాలు ఇవి!
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కోగానే.. ఆయనకు ఆడియో టేపులు వెలుగు చూడగానే తెలుగుదేశం నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. బాబు తో సహా ఏపీ ప్రభుత్వ ముఖ్యుల ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని.. వాటిని తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందంటూ వారు విరుచుకుపడ్డారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అంతటితో ఆగక హైదరాబాద్ లో సెక్షన్ ఎనిమిదిని అమలు చేయాలన్నారు. ఈ విషయంలో గవర్నర్ పై విరుచుపడ్డారు. తప్పు అంతా గవర్నర్ దే అన్నట్టుగా మాట్లాడారు.
ఇలా మాట్లాడటంలోనే చాలా అతి కూడా చేశారు. గవర్నర్ గంగిరెద్దులా మారాడని తెలుగుదేశం నేతలు విరుచకుపడ్డారు. అయితే గవర్నర్ పై తెలుగుదేశం పార్టీ కోపానికి వేరే రీజన్ ఉందని.. ఓటుకు నోటు వ్యవహారంలో గవర్నర్ కేంద్రానికి ఇచ్చిన నివేదిక నచ్చకే తెలుగుదేశం నేతలు నరసింహన్ ను విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.మరి లాంటి నేపథ్యంలో గవర్నర్ ను గంగిరెద్దు వంటి తీవ్రమైన పదాలు ఉపయోగించి విమర్శలు చేయడం వల్ల ఆయన ఫీల్ అయ్యాడు. దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం నేతలు పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగారు. గవర్నర్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెబుతున్నామని అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం నేతలు కొంత తగ్గడం అయితే జరిగినట్టుంది!
