నందమూరి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన పుట్టిన రోజు వేడుకల సమయంలో ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఎంతో ఘనంగా జరుపుతుంటారు. రేపు (మే 20, గురువారం) ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు ఆయన ‘ఏ హంబుల్ రిక్వెస్ట్’ అంటూ బహిరంగంగా లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని, ఎవ్వరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒక రకంగా ఇది ఫ్యాన్స్ కి నిరాశ పరిచే వార్తే అయినా.. ఆయన చేసిన విజ్ఞప్తిలో ఎంతో అర్ధం ఉందని అంటున్నారు. మే 10 న జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనతోపాటు కుటుంబ సభ్యులు హోం క్యారంటైన్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ.. తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన లేఖలో గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలను చూస్తున్నాను.
మీ అందరి ఆశీస్సులు నాకెంతో ఊరటను కలిగిస్తున్నాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను చాలా బాగున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తానని అన్నారు. ఈ ఏడాది మాత్రం మీరంతా ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరిచ్చే అతి పెద్ద కానుకలా భావిస్తానని ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది వేడుకలు చేసుకునే టైం కాదు. దేశం ఇప్పుడు కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మనం సంఘీభావం తెలపాలి.
ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాల్సిన సమయం. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు మనమందరం కలిసి వేడుక చేసుకుందాం.. అని ఎన్టీఆర్ అభిమానులకు లేఖ రాసుకొచ్చాడు.
