కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. జూ ఎన్టీఆర్ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం సాగింది. తమిళనాడులో విజయ్ సక్సెస్ అయిన రూటులోనే ముందుగా సేవా సంస్థల ఏర్పాటు.. క్రమేణా రాజకీయంగా అడుగులు వేస్తారంటూ విశ్లేషణలు వచ్చాయి. అందులో భాగంగా ఈ నెల 18న తిరుపతిలో ఒక హోటల్ లో ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ సమయంలో అసలు విషయం పైన జూ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. RAW NTRతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని.. NTR తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. NTR పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి.. ఎవరికీ అధికారం లేదు ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది.
జూ ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాలు ఏవైనా అధికారిక బృందం ద్వారా లేదా వ్యక్తిగతంగా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటించింది. అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ”ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము. అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి..” చేస్తూ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు.
