ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ నాలుగోసారి పొడగించారు. తాజాగా నవంబర్ 1 వరకు రిమాండ్ పొడగించింది న్యాయస్థానం. తర్వాత చంద్రబాబు బెయిల్‌పై వాదనలు జరుగగా సుప్రీం కోర్టులో బాబు బెయిల్‌కు సంబంధించిన పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది న్యాయస్థానం.
ఇక చంద్రబాబు ఆరోగ్యంపై న్యాయమూర్తి ముందు ఆందోళన వ్యక్తం చేశారు సిద్ధార్థ్ లూథ్రా. చంద్రబాబు హెల్త్ కండీషన్ పై మెమో దాఖలు చేయగా వైద్యులు సిఫార్సు చేసిన అంశాలను వివరించారు. బాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపుతూ రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ డాక్టర్లు చేసే వైద్య పరీక్షలు, వారు ఇచ్చే రిపోర్టులపై తమకు నమ్మకం లేదని…వ్యక్తిగత వైద్యులతోనే చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం వరకు ఓకే కానీ ప్రభుత్వ డాక్టర్లపై నమ్మకం లేదని వాదించడమే విమర్శలకు దారి తీసింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వ డాక్టర్లపై నమ్మకం లేకపోతే సామాన్య ప్రజల సంగతేంటా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు హెల్త్ కి ఎటువంటి ఇబ్బంది లేదని, రెగులర్ గా హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాదులు, స్వయంగా డాక్టర్లే వెల్లడించినా చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నం చేయడం ఒకే కానీ ఇందుకు ప్రభుత్వ డాక్టర్ల పనితీరు బాగా లేదని చెప్పడం సరికాదని టీడీపీ నేతలకు ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు.
