ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు ఏపీ సీఐడీ వైఖరి నిద్రలేకుండా చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న నిర్ణయించగా సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ … ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనుంది. రూ. 144.53 కోట్లు ఫైబర్ నెట్లో స్కాం జరిగిందని సీఐడీ ఇప్పటికే ఛార్జీషిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఫైబర్ నెట్ స్కాం కేసుఓ ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ11గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ25గా చంద్రబాబునాయుడుల పేర్లు నమోదు చేశారు. తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ చేశారు.
అలాగే నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ చేశారు. మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి.
రూ.330 కోట్లతో చేపట్టిన ఫైబర్ నెట్ మొదటి దశ ప్రాజెక్టు కాంట్రాక్టును టెరా సాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టడమే కాదు బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీపై నిషేధం తొలగించి ఏకపక్షంగా టెండరు ఖరారు చేశారన్నది సీఐడీ అభియోగం.
