తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అర్ధరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారో కేటీఆర్ చెప్పాలి అని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్, లోకేష్ మధ్య భేటీ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ఆరోపణలను చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో హడావుడి చేయడం లేదని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు తప్పవని…ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఢిల్లీకి కాకుండా ఫామ్‌హౌస్‌కు వెళ్తే సమస్యలు పరిష్కారం కావు అని కేసీఆర్‌ను విమర్శించారు. నెలకు కనీసం రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను తిరిగి భర్తీ చేస్తామని.. ప్రస్తుతం 65 కార్పొరేషన్లకు రెండేళ్ల పదవీకాలంతో నియామకాలు జరిగాయని సీఎం వెల్లడించారు.
