తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థిని అని తెలిపారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్‌కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..నన్ను విమర్శించే వారు నేను ఇచ్చిన తీర్పు చదవండి… కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలి అన్నారు. అది నా తీర్పు కాదు కోర్టు తీర్పు… నా తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారు అన్నారు.
అందులో ఒక్క కామాను కూడా మార్చలేకపోయారు. రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరముంది అన్నారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థిని..ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించను అని చెప్పారు.
తనపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారు…కానీ అలాంటి వ్యక్తిని కాదన్నారు. ఈ దేశంలోని ప్రజలు ముందు ఓటర్లు, తర్వాతనే పౌరులు అయ్యారని అన్నారు. ఓటరు లిస్ట్ చిత్తు కాగితం అనుకుంటున్నారని…ఓటరు లిస్టులో ఇష్టం ఉన్న వారి పేరును రాస్తాం, ఇష్టంలేని వాళ్ల పేర్లు రాయమంటే ఎలా? అని ప్రశ్నించారు.
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయపరమైన పదవి కాదు…. 5 సార్లు రాజ్యాంగంపై ప్రమాణం చేశాను… రాజ్యాంగానికి బద్ధుడినై ఉండడమే కాదు, కాపాడడం నా బాధ్యత అని స్పష్టం చేశారు.
