సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్ట పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం . మరణించిన వారికి అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని, మృతుల కుటుంబాల నుండి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది తెలంగాణ మంత్రుల కేబినెట్.
మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన బృందాన్ని సౌదీ అరేబియా పంపించాలని నిర్ణయించింది మంత్రి వర్గం.
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 42 మంది సజీవదహనం కాగా హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉంది.
మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది బస్సు.
ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం అయ్యారు. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించారు అధికారులు. బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో మృతదేహాలు దహనమయ్యాయి. ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
