దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి వివాదాలు తలనొప్పిగా మారాయి. ఇటీవల మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ అనంతరం, ఆయనపై రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హనుమంతుడిపై రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా, ఈ సంస్థ రాజమౌళిపై మరో రెండు ఫిర్యాదులను నమోదు చేసింది. సినిమా ఈవెంట్‌లో మహేష్ బాబుని నంది (శివుడి వాహనం)పై వచ్చినట్లుగా చూపించడంపై వానర సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. నందిపై శివుడు మాత్రమే రావాలని, మహేష్ బాబు లాంటి హీరోను చూపించడం దేవుళ్లను అగౌరవపరచడమేనని ఆరోపించింది.
ఇటీవల రీ-రిలీజ్ అయిన ‘బాహుబలి’ తర్వాత విడుదల చేసిన ఒక కామిక్ సిరీస్ ట్రైలర్‌లో, బాహుబలి రాక్షసుల పక్షాన నిలబడి ఇంద్రుడితో పోరాడుతున్నట్లు చూపించారు. మానవుడైన బాహుబలి ఇంద్రుడితో పోరాడటం అంటే దేవతలను కించపరచడమేనని వానర సేన మండిపడుతోంది.మతపరమైన అంశాలు సున్నితమైనవి కాబట్టి, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని, ఇతరుల హక్కులు, మనోభావాలకు గౌరవం ఇవ్వాలని రాష్ట్రీయ వానర సేన డిమాండ్ చేస్తోంది.
