కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు కేవలం 17 శాతం మాత్రమే కేటాయించడం ప్రజలను మోసగట్టినట్టేనని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ పాలనలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పుడు, కొత్త ప్రభుత్వం ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించడం ప్రజల నమ్మకానికి ద్రోహమని ఆయన అన్నారు. బీసీలను ఇంత పెద్ద స్థాయిలో మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెండు చెంపల మీద చేతులు వేసుకుని క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ మండిపడ్డారు.
కులగణన సర్వే పేరిట 160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి, దానిపై “రాహుల్–రేవంత్ మోడల్” అంటూ ప్రచారం చేసుకోవడం రాజకీయ ప్రయోజనం కోసం చేసిన చర్య మాత్రమేనని విమర్శించారు. పార్టీ గుర్తు లేకుండా జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని కేటీఆర్ ధ్వజమెత్తారు. “బీసీలను ఇలా మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్తారు,” అని ఆయన నమ్మకంగా చెప్పారు.
వరంగల్ జిల్లా పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన అభివృద్ధి దృష్టిని గుర్తుచేస్తూ కేటీఆర్ అన్నారు—“పత్తి పంటకు, అజం జాహీ మిల్లులకూ వరంగల్ ఓ ప్రధాన కేంద్రం. కానీ ఆంధ్రప్రదేశ్ కాలంలో వరంగల్ తన పూర్వ వైభవం కోల్పోయింది. నేతన్నలు వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి కేసీఆర్ హయాంలో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశాం అన్నారు.
అదే విధంగా, హైదరాబాద్‌లో కాలుష్య కారకాలైన పరిశ్రమలను తరలించేందుకు, ఫార్మా రంగానికి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ఫార్మా సిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రూపొందించిందని ఆయన గుర్తు చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టును “ఫ్యూచర్ సిటీ” పేరిట రియల్ ఎస్టేట్ దందాగా మార్చి, 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేయాలని చూస్తోందని, దీంతో తెలంగాణను ఏటీఎంగా మార్చాలన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం చేయాలని చూస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఇది చూస్తూ మాత్రం ఊరుకోదు,” అని హెచ్చరించారు కేటీఆర్.
