ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పవన్ కళ్యాణ్‌ను ‘అవకాశవాది’గా అభివర్ణించారు.
దయాకర్ మాట్లాడుతూ…“తెలంగాణలో ఉంటే ఇక్కడి పాట, ఆంధ్రాలో ఉంటే అక్కడి పాట పాడతారు. బీజేపీతో ఉన్నప్పుడు ఒక విధంగా, టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ బతుకునేర్చిన ఈ పాటలను తెలుగు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని విమర్శించారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా స్టేట్‌మెంట్ ఇవ్వడం బాధ్యతా రాహిత్యమని దయాకర్ పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌పై మండిపడుతూ, “పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకే కోనసీమకు దిష్టి తగిలింది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివినట్లు మాట్లాడుతున్నారు. ఇది రెండున్నర గంటల సినిమా కాదు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ ప్రజలపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు” అని అన్నారు.
