పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక గణన (SIR) నిర్వహణలో పాల్గొన్న బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) మరణిస్తున్న పరిస్థితిపై సుప్రీం కోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతున్నప్పటికీ, ఎక్కువ పని భారం మోపడం పట్ల కోర్టు అభ్యంతరం తెలిపింది. పని భారం తగ్గించేలా రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వాలు BLOల భద్రత, వారి పని గంటల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోర్టు స్పష్టం చేసింది. పనిచేసే సిబ్బందిని పెంచి వారికి స్వల్ప పని భారం ఉండేలా చూడాలని సూచించింది.అవసరమైతే విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి అని సూచించింది. ఏదైనా ఉద్యోగికి వ్యక్తిగత కష్టాలు, ఆరోగ్య సమస్యలు లేదా ప్రత్యేక కారణాల వల్ల డ్యూటీలో నుంచి మినహాయింపు కావాలనుకుంటే, సంబంధిత అధికారులు కేసు ప్రాతిపదికన ఆ అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం 10,000 మంది పనిచేస్తున్న చోట అవసరమైతే 20,000–30,000 మందిని కూడా నియమించవచ్చని, తద్వారా BLOలపై ఒత్తిడి తగ్గుతుందని కోర్టు సూచించింది. అనారోగ్యంతో ఉన్న BLOలకు ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాలి.ఎవరైనా BLO అనారోగ్యంతో ఉన్నా, లేదా విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్నా, ఆ స్థానంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఉద్యోగిని నియమించాలని కోర్టు తెలిపింది.
గత ఒక నెలలో 12 రాష్ట్రాల్లో SIR పనిలో ఉన్న అనేక మంది BLOలు మరణించారు. వారి కుటుంబ సభ్యులు “అతి పని ఒత్తిడే” కారణమని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించాయి.
ఒక పత్రికలో వచ్చిన నివేదికను ఉటంకిస్తూ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ “SIR అనేది సంస్కరణ కాదు… ప్రజలను వేధించే బలవంతపు విధానం అని వ్యాఖ్యానించారు. మూడు వారాల్లో 16 మంది BLOలు ప్రాణాలు కోల్పోయారు. హార్ట్ అటాక్స్, ఒత్తిడి, ఆత్మహత్యలు—ఇది సంస్కరణ కాదు, ఒత్తిడి తలపెట్టే చర్య అని Xలో రాశారు. కొంత మంది BLOలు ఆత్మహత్య చేసుకున్నట్లు, మరికొందరు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది. SIRకు సంబంధించి మరణాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో నమోదయ్యాయి.
