ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైసీపీ గూటికి చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఎలూరు జిల్లా జనసేన నాయకులు అధికారికంగా వైసీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
చింతలపూడి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ జనసేన నేతలు బండారు గంగా సురేష్, ఆనెం సుభాష్‌లు తమ అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేత జడ్డు దామోదర్ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జనసేనలో పనిచేస్తూ ప్రజాసేవ చేయాలనే ఆశతో ముందుకు వెళ్లామని, అయితే ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం వైసీపీనే సరైన వేదికగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చేరిన నేతలు తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతోనే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు.
వైసీపీలో చేరిన నేతలకు పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింత దగ్గరగా పనిచేయాలని సూచించారు. ఈ చేరికలతో ఎలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వైసీపీ బలం మరింత పెరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రానున్న రాజకీయ సమీకరణాల్లో ఈ పరిణామం కీలకంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
