టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్తాన్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. టోర్నమెంట్‌లో ఇది వారి మూడో మ్యాచ్. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై ఓడిన ఆప్ఘాన్.. యూఏఈపై ఘన విజయం సాధించింది.
ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ అఫ్గానిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన అజ్మతుల్లా , బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఇబ్రహీం జద్రాన్ అవుటైన తర్వాత 41 బంతుల్లో 64 పరుగులు అవసరమైన సమయంలో, ఒమర్జాయ్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి చివరి ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు.
గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో కలిసి ఉన్న అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌లలో రెండు పాయింట్లు సాధించింది. తదుపరి దశకు చేరుకోవాలంటే ఫిబ్రవరి 19న చెన్నైలో కెనడాపై తప్పక గెలవాలి. అయితే అది సరిపోదు. ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న న్యూజిలాండ్, ఫిబ్రవరి 17న కెనడాతో ఓడిపోవాలి.
న్యూజిలాండ్ గెలిస్తే అఫ్గానిస్తాన్ ఆశలు ముగుస్తాయి. రెండు జట్లు నాలుగు పాయింట్లతో సమంగా ఉంటే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది.
