ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. సభ ప్రారంభంలోనే మైక్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఆయన సభ్యులకు తెలియజేశారు. రాత్రంతా సిబ్బంది పనిచేసి సిస్టమ్‌ను సెట్ చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని వివరించారు.
మైక్ సిస్టమ్‌లో తలెత్తిన టెక్నికల్ ఇబ్బందులను అధిగమించేందుకు ముంబై నుంచి నిపుణులను రప్పిస్తున్నామని స్పీకర్ తెలిపారు. వారు వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలించి లోపాలను సరిచేస్తారని చెప్పారు. అప్పటివరకు సభా కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి సభ్యుడి డెస్క్ వద్ద ఉన్న మైక్‌కు ఆన్, ఆఫ్ బటన్ ఉందని, మాట్లాడే సమయంలో దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైతే కార్డ్‌లెస్ మైకులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా సభా చర్చలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. సభ్యుల సహకారంతో సభను సజావుగా నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
