అత్తగారింట్లో చిన్న అల్లుడికి జరిగిన చిన్నపాటి ‘అవమానం’ ఊహించని విధంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న చంద్ర మౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముగ్గురు అల్లుళ్లు తమ అత్తగారింటికి వెళ్లారు. ఉత్సవాల సందర్బంగా అత్తింటి వారు మర్యాదల ప్రకారం అల్లుళ్లకు సంప్రదాయ స్వీట్లు పెట్టే ఏర్పాట్లు చేశారు.
మొదటి ఇద్దరు అల్లుళ్లకు కజ్జికాయలు పెట్టగా, చిన్న అల్లుడికి మాత్రం అవి అందలేదు. ఇది గమనించిన అతడు “నాకు కజ్జికాయలు ఎందుకు పెట్టలేదు? ఇదేం మర్యాద?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న వివాదంగా మొదలైన ఈ విషయం కాస్తా పెద్దదై, చివరకు చిన్న అల్లుడు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులను సమాధానపరిచి, అపార్థం వల్లే ఇలా జరిగిందని చెప్పి శాంతింపజేశారు. అనంతరం ముగ్గురు అల్లుళ్లకూ స్వయంగా కజ్జికాయలు పంచిపెట్టారు. దీంతో చిన్న అల్లుడు సంతృప్తి చెందగా, కుటుంబంలో నవ్వులు పూశాయి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే ముందు చర్చించుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
