కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థులపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. స్కూల్కు షూ వేసుకుని రాలేదన్న కారణంతో ఇద్దరు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కనకలక్ష్మి, షూ ధరించకుండా స్కూల్కు వచ్చిన విద్యార్థులను శిక్షించేందుకు వారి మెడలో చెప్పుల దండ వేసినట్లు సమాచారం. ఈ ఘటనను చూసిన ఇతర విద్యార్థులు, స్థానికులు షాక్కు గురయ్యారు.
ఘటనకు సంబంధించిన విషయం బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. వెంటనే ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. విద్యార్థులను ఇలాంటి విధంగా అవమానించడం సరైన చర్య కాదని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై మానసిక ప్రభావం పడేలా శిక్షలు విధించడం అసహ్యకరమని వారు అంటున్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన టీచర్ కనకలక్ష్మి, తాను పిల్లలను అవమానించాలని ఉద్దేశంతో అలా చేయలేదని చెప్పారు. విద్యార్థులు ఇకపై క్రమశిక్షణతో ఉండాలని ఉద్దేశంతోనే ఆ చర్య తీసుకున్నానని ఆమె వివరణ ఇచ్చారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీసింది.
