సక్రమ మార్గంలో నడవాలని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికిన ఓ ఉపాధ్యాయుడిపై మాజీ విద్యార్థి కిరాతకానికి ఒడిగట్టాడు. పాత కక్షను మనసులో పెట్టుకుని, ఏకంగా ఇనుపరాడ్డుతో దాడి చేసి గురువును ప్రాణాపాయ స్థితికి నెట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో కలకలం రేపింది.
పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామానికి చెందిన వెంకట సురేష్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఆర్యదీప్ అనే యువకుడు గతంలో సురేష్ వద్ద విద్యార్థిగా ఉండేవాడు. ఆర్యదీప్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో, ఒక ఉపాధ్యాయుడిగా సురేష్ అతడిని పలుమార్లు మందలించారు. “సక్రమ మార్గంలో నడుచుకోవాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి” అని హితవు పలికారు.
అయితే, తన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, తనను అందరి ముందు మందలించాడనే నెపంతో ఆర్యదీప్ గురువుపై కక్ష పెంచుకున్నాడు.బుధవారం ఉపాధ్యాయుడు వెంకట సురేష్ బయటకు వచ్చిన సమయంలో, అప్పటికే అదను కోసం వేచి చూస్తున్న ఆర్యదీప్ ఒక్కసారిగా ఇనుపరాడ్డుతో ఆయనపై దాడికి దిగాడు. తల, ఇతర శరీర భాగాలపై బలంగా కొట్టడంతో సురేష్ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పాలకొల్లు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు ఆర్యదీప్పై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
