దర్శకుడు ఆదిత్య దర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటుతూ వేగంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఈ విజయాల మధ్య సినిమా ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో AI ద్వారా రూపొందించిన కొన్ని ఫేక్ చిత్రాలు వైరల్ కావడంతో, దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు.
ఆయన విడుదల చేసిన ప్రకటనలో, “కొంతమంది వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మార్ఫ్ చేసిన చిత్రాలను ప్రచారం చేస్తూ తప్పుదారి పట్టించే కథనాలు సృష్టిస్తున్నారు” అని తెలిపారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ టర్బన్ ధరించి స్మోకింగ్ చేస్తున్నట్లు చూపిన చిత్రం పూర్తిగా అసత్యమని, అది సినిమాలో ఎక్కడా భాగం కాదని స్పష్టం చేశారు.
సిక్కు సమాజంపై తనకు అత్యంత గౌరవం ఉందని ఆదిత్య ధర్ పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి పాత్రను గౌరవంతో, బాధ్యతతో చూపించామని తెలిపారు. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను నమ్మకూడదని ప్రేక్షకులకు సూచిస్తూ, అధికారికంగా విడుదలైన సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. ఈ తరహా తప్పుదారి పట్టించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల AI టెక్నాలజీ వాడకం పెరగడంతో ఇలాంటి ఫేక్ కంటెంట్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ధురంధర్ 2 భారీ విజయంతో పాటు AI ఫేక్ కంటెంట్ వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది.
