భారత బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం నమోదైంది. ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఆ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
గత కొంతకాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఉన్న నీలినీడలు ఇప్పుడు నిజమయ్యాయి. నిరంతర నిబంధనల ఉల్లంఘనలు మరియు పర్యవేక్షణ లోపాల కారణంగా ఈ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.
ఈ రోజుతో (ఏప్రిల్ 24, 2026) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన అన్ని రకాల కార్యకలాపాలను ముగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంటే, ఇకపై ఈ బ్యాంక్ ద్వారా ఎలాంటి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా వాలెట్ టాప్-అప్‌లు నిర్వహించడానికి వీలుండదు.
ఆర్‌బీఐ ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాదు. గతంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ పలు హెచ్చరికలు జారీ చేసింది.గతంలోనే ఈ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఖాతాదారుల వివరాల సేకరణలో మరియు మనీ లాండరింగ్ నిరోధక నిబంధనల అమలులో బ్యాంక్ విఫలమైందని ఆర్‌బీఐ గుర్తించింది.
ఎన్నిసార్లు గడువు ఇచ్చినప్పటికీ, బ్యాంక్ తన పనితీరును మెరుగుపరచుకోకపోవడంతో చివరకు లైసెన్స్ రద్దు చేసే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేసింది.లైసెన్స్ రద్దు చేసినప్పటికీ, ప్రస్తుతం ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి లేదా వాడుకోవడానికి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సమాచారం. అయితే, కొత్తగా డబ్బులు జమ చేయడం మాత్రం కుదరదు. ఫాస్టాగ్ (Fastag) మరియు వాలెట్ సేవలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.
డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న పేటీఎంకు ఇది కోలుకోలేని దెబ్బ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లో పేటీఎం (One97 Communications) షేర్లపై కూడా పడే అవకాశం ఉంది.
