ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ సీట్‌గా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పార్టీ అధిష్టానం తప్పించింది. కూటమి ప్రభుత్వంలో జనసేన-టీడీపీ నేతల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.
ఇటీవల పిఠాపురంలోని పాడ (PADA) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీస్తున్న క్రమంలో అక్కడ ఉన్న జనసేన నాయకులతో వాగ్వాదం మొదలైంది.
జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు వర్మతో వాదిస్తుండగా, జనసేన నేత పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. “పిచ్చిపిచ్చి వేషాలొద్దు” అంటూ వర్మపైకి దూసుకెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణ కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేసింది.
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్టానం, కూటమి ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో వర్మను ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఇన్నాళ్లూ నియోజకవర్గ బాధ్యతలు చూసిన వర్మ స్థానంలో, పార్టీ వ్యవహారాలను నడిపించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించింది.
కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంపై అధిష్టానం సీరియస్ అయింది. నియోజకవర్గంలో పట్టున్న నాయకుడిగా పేరున్న వర్మను పదవి నుంచి తప్పించడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై వర్మ వర్గీయుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
