ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు పరిపాలన పరమైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన సుమారు 25 ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 2,01,023 కోట్ల మేర భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ఊపునిస్తుందని భావిస్తున్నారు.
ప్రధానమంత్రి ఇచ్చిన పొదుపు పిలుపు మేరకు, రాష్ట్రస్థాయిలో ఖర్చులను ఎలా తగ్గించాలనే అంశంపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది. సీఎం, మంత్రులు మరియు ఉన్నతాధికారుల స్థాయిలో పాటించాల్సిన పొదుపు చర్యలపై మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని విభాగాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాన్ని కల్పించే అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు పనితీరు మెరుగుపడుతుందా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది.
పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులు, తాజా రాజకీయ పరిణామాలు మరియు ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.పెట్టుబడుల పరంగా చూస్తే ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
