మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ రూరల్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ అదే తరహా గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథపై ఇప్పటివరకు రకరకాల ప్రచారాలు జరిగాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో సైతం అసలు కథను దాచిపెట్టి రామ్ చరణ్‌ను కేవలం ఒక స్పోర్ట్స్ మ్యాన్‌గా మాత్రమే చూపించారు. దీనివల్ల ఈ సినిమా అంతా క్రీడల చుట్టూనే తిరుగుతుందని అందరూ భావించారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు సన ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఒక ఊహించని సరికొత్త కథాంశాన్ని సిద్ధం చేశారు.
ఈ సినిమాలో స్పోర్ట్స్ అనేది కేవలం ఒక భాగం మాత్రమేనని.. అసలు కథ అంతా ఒక ‘రైల్వే ట్రాక్’ అంశం చుట్టూ నడుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ఒక రైల్వే ట్రాక్‌ను అంతర్లీనంగా చూపించడం ఈ అనుమానాలను బలపరిచింది. ‘పెద్ది’ సినిమాలో పలు రకాల క్రీడలు ఉన్నప్పటికీ.. కథానాయకుడి పోరాటం మాత్రం తన ఊరి ఉనికి కోసం.. తమ ప్రాంతానికి రావాల్సిన రైల్వే ట్రాక్ కోసమేనని తెలుస్తోంది. ఈ హక్కుల పోరాటంలో భాగంగానే పెద్ది పాత్ర ఢిల్లీకి వెళ్లడం.. అక్కడ ప్రభుత్వ పెద్దలకు అర్జీలు పెట్టుకోవడం వంటి ఆసక్తికర ఘట్టాలు సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా ప్రారంభం నుండి రైలు ప్రయాణానికి సంబంధించిన హింట్స్ ఇస్తూనే వచ్చారు. సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్.. మొదటి పోస్టర్లలో ట్రైన్ విజువల్స్ కనిపించాయి. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రైల్వే ట్రాక్ పైనే డిజైన్ చేశారు. ట్రైలర్ మొదటి షాట్ కూడా రైల్వే ట్రాక్ మీద నుంచే ప్రారంభం కావడం గమనార్హం.
ఇలాంటి చిన్న హింట్లతో కథపై క్యూరియాసిటీ పెంచిన దర్శకుడు.. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక ఇంటెన్స్ ఎమోషనల్ రైడ్‌ను అందించబోతున్నారు. రామ్ చరణ్ నటన ఈ చిత్రంలో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. బుచ్చిబాబు మార్క్ రూరల్ ఎమోషన్స్ ఏ స్థాయిలో వర్కవుట్ అయ్యాయో తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
