విజయవాడలో జరిగిన తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొని మాట్లాడారు. విజయవాడ తనకు ఎంతో లక్కీ సిటీ అని, గతంలో నాన్నగారి చిత్రాలతో పాటు తన ‘ఖైదీ నెంబర్ 150’, ‘ఇంద్ర’ సినిమాలు ఇక్కడే జరుపుకున్నామని గుర్తుచేసుకున్నారు. తీవ్రమైన ఎండలో కూడా గంటల తరబడి వేచి చూసి, తనకు ఇంతటి ఘనస్వాగతం పలికిన అభిమానుల ఎనర్జీని చూస్తుంటే ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లా లేదని, ఒక సక్సెస్ మీట్ చేస్తున్నట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్టిస్ట్‌గా కెరీర్‌లో ఎన్నో కథలు వింటుంటామని, కొన్ని నచ్చితే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని, కానీ ‘పెద్ది’ కథ మాత్రం తన హృదయానికి చాలా దగ్గరగా హత్తుకుపోయిన అద్భుతమైన సబ్జెక్ట్ అని రామ్ చరణ్ అన్నారు. ఇలాంటి కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన సినిమా జర్నీలో ఇదొక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని చెప్పారు. గతంలో తనకు ‘మగధీర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల షూటింగ్ సమయంలో ఎలాంటి అనుభూతి కలిగిందో.. మళ్లీ ‘పెద్ది’ సినిమా చేస్తున్నప్పుడే అలాంటి అరుదైన ఎక్స్పీరియన్స్ కలిగిందని తెలిపారు. తనకు ఇంతటి గొప్ప కథను అందించిన గురువు సుకుమార్ గారికి, దర్శకుడు బుచిబాబు సానాకు ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇండియాలోనే టాప్ 3-4 దర్శకులలో బుచిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందని చరణ్ ప్రశంసించారు.
అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తున్నానని, వారి ఇచ్చే ప్రోత్సాహం, ఎనర్జీనే తనకు కొండంత బలమని చరణ్ కొనియాడారు. “మీకోసం చేతులు ఇరక్కోవడమే కాదు.. రక్తం చిందించైనా సరే కష్టపడతాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు తెలిసిన ఏకైక విద్య” అని అన్నారు. “నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, రాసిపెట్టుకోండి..” అంటూ రామ్ చరణ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో స్టేడియం మొత్తం మెగా నినాదాలతో మారుమోగిపోయింది. అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ.. ఆమెను చూస్తే స్వర్గంలో ఉన్న శ్రీదేవి గారు ఎంతో గర్వపడతారని, భవిష్యత్తులో జాన్వీ తన తల్లి కంటే పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ అని, ప్రొడ్యూసర్ సతీష్ గారు ఎంతో చిత్తశుద్ధితో వెన్నంటి ఉండి సినిమాను నిర్మించారని చరణ్ అభినందించారు. సినిమాలోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. “ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది కేవలం ఆటగాడు ఓడిపోయినట్టు కాదు.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు.. ఈ పెద్దిగాడు ఆట ఆడలేదు, పోరాడాడు.” అని చెప్పి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. కనకదుర్గమ్మ సాక్షిగా ఈ ‘పెద్ది’గాడి ఆత్మగౌరవాన్ని ప్రేక్షకులు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతున్నానని, జూన్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. చివరగా ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన నమస్కారాలు చెప్పాలంటూ రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు.
