కర్ణాటకలో కొలువు తీరిన డీకే ప్రభుత్వంలో లుకలుకలు బయట పడుతున్నాయి. మంత్రులు వరుసగా అలక బూనుతున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు కొత్త వివాదంగా మారుతోంది. శాఖల కేటాయింపుల పైన అలక బూనిన మంత్రులు రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేసారు. తాజాగా అదే బాటలో మరో సీనియర్ మంత్రి మునియప్ప కనిపిస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ బెంగళూరులో ఉన్న సమయంలోనే వీరు తమ ఈ విధంగా వ్యవహరించటంతో.. పార్టీ సీరియస్ అయింది. వారిని బుజ్జగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం స్టార్ట్ అయ్యింది. మంత్రివర్గంలో శాఖల కేటాయింపు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. బుధవారం రోజే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కేవలం రెండు రోజులు తిరక్కుండానే శుక్రవారం తన రాజీనామా లేఖను సమర్పించడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగారెడ్డి.. డీకే శివకుమార్ కేబినెట్‌లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించారు. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించారు. తనకు డీకే బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తామని హామీ చెప్పారని.. ఇచ్చిన మాట తప్పడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తునట్లు రామలింగారెడ్డి ప్రకటించారు.
మరి కాసేపటికే మరో సీనియర్ మంత్రి తన అసహనం బయట పెట్టారు. మునియప్పకు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. కాగా, మునియప్ప తనకు సాంఘిక సంక్షేమం.. వ్యవసాయ శాఖ కావాలని కోరుతున్నారు. తనకు కేటాయించిన శాఖల పైన అసహనం వ్యక్తం చేసిన ఆయన అలక బూనారు. కాగా.. అటు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన సీరియస్ గా ఉంది. మంత్రులు అలక బూనినా ఎవరినీ బుజ్జగించే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల తో కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది. అయితే, పార్టీ నాయకత్వం మాత్రం వీరి విషయంలో కఠినంగానే వ్యవహరించాలని స్పష్టం చేసింది. దీంతో.. వీరి శాఖల మార్పులో పునరాలోచన ఉండదనేది క్లారిటీ వచ్చేసింది. మంత్రులే రాజీ పడతారా.. అదే పట్టు మీద ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
