కూటమి ప్రభుత్వం పాలనలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రశ్నించిన వారిపై కేసులు,దాడులు, కబ్జాలు వెరసీ ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేబీ శ్రీనివాస్ తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య మునిరాజమ్మ ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతో ఆయన భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు మునిరాజమ్మ మాట్లాడుతూ…తమకు చెందిన విలువైన భూమిని జేబీ శ్రీనివాస్ బలవంతంగా కబ్జా చేసి ఇతర వ్యక్తులకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తమ భూమిని కాపాడుకునేందుకు తాము ప్రయత్నించగా ప్రశ్నించినందుకు తమపై దాడులకు మరియు బెదిరింపులకు తెగబడుతున్నారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
ఈ అన్యాయంపై తాము గత కొంతకాలంగా కోర్టులు… పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా అధికార పార్టీ నేత ఒత్తిళ్ల కారణంగా తమకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మునిరాజమ్మ ఆరోపించారు. స్థానిక యంత్రాంగం కూడా తమ ఫిర్యాదులపై సరిగ్గా స్పందించడం లేదని ఆమె వాపోయారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమకు న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
