రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుండే వ్యూహాలను సిద్ధం చేస్తోంది వైసీపీ. త్వరలో జగన్ పాదయాత్రకు సిద్ధం అవుతుండగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతోంది. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలపై ఇప్పటికే సమరశంఖం పూరించిన జగన్… కేడర్‌లో జోష్ నింపుతున్నారు.
దీంతో వైసీపీలో గతంలో చురుకుగా ఉన్నవారు సైతం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పార్లమెంట్‌కు సంబంధించిన అభ్యర్థి ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుండి పోటీ చేశారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆమె..ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీ ఇచ్చిన హామీలపై జరుగుతున్న నిరసన పోరును విశాఖ పార్లమెంట్ పరిధిలో ముందుండి నడిపిస్తున్నారు.
గతంలో ఆమె బొబ్బిలి, విజయనగరం నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం నేపథ్యంలో మరోసారి విశాఖ టికెట్ ఆమెకే ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో గట్టిపట్టున్న నేత బొత్స. అంతేగాదు వైసీపీకి ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉన్నారు. దీనికి తోడు విశాఖ పార్లమెంట్ పరిధిలో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం ఆమెకు అదనపు బలం.రాబోయే రోజుల్లో మహిళా బిల్లు అమలులోకి వస్తే, మహిళా కోటాలో ఈ సీటును ఆమెకే కేటాయించే వ్యూహంలో వైసీపీ ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్న పాత నేతలందరినీ ఏకం చేసే బాధ్యతను తీసుకుని ముందుకుసాగుతుఉన్నారు. వచ్చే మూడేళ్లు ప్రజాక్షేత్రంలో ఉండటం కలిసివస్తుందని భావిస్తున్న ఝాన్సీ… ఓడిపోయిన చోటే గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
