- Advertisement -

స్నేహితులను భయపెట్టబోయి..

- Advertisement -

స్నేహితులను సరదాగా భయపెట్టాలని చేసిన ప్రయత్నం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలిగొంది. చేత్తో పామును పట్టుకున్న క్రమంలో అది కాటు వేయడంతో, చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మరణించిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సేనీ (30)కి మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్ ఉంది. ఈ నెల 17వ తేదీ రాత్రి ఆయన తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఫామ్‌హౌస్‌లోకి ఒక కట్లపాము వచ్చింది. దాన్ని చూసిన మొహిద్దీన్, తన స్నేహితులను ఆటపట్టించి భయపెట్టాలనే ఉద్దేశంతో పామును చేతిలోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో పాము అకస్మాత్తుగా మొహిద్దీన్ కుడిచేతి బొటనవేలును గట్టిగా కాటు వేసింది. స్నేహితులు ఆందోళన చెందుతుండగా, “అదేమీ కాదు, చిన్న పామే.” అని మొహిద్దీన్ వారిని వారించారు. తన నిర్లక్ష్యం వల్ల ప్రాణాపాయం లేదని భావించి ప్రాథమిక చికిత్స తీసుకోలేదు.

పాము కాటు వేసిన గంట తర్వాత మొహిద్దీన్ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. శరీరంలో మార్పులు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, ఆయన్ను మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ చేరిన కొద్దిసేపటికే మొహిద్దీన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరదా కోసం చేసిన ఒక చిన్న పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని తీయడంతో, ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -