- Advertisement -

అన్యోన్యంగా ఉండేవారు.. కానీ మ‌ద్యం మ‌త్తులో..

- Advertisement -

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త, క్షణికావేశంలో ఆమెను గొంతు నులిమి చంపి, అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నూకపల్లికి చెందిన వోలెపు నాగరాజు (49), లక్ష్మి (45) దంపతులు 24 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఒక బాలుడిని దత్తత తీసుకున్నారు. నాగరాజు వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాగరాజుతో భార్య లక్ష్మికి గొడవ మొదలైంది.

ఈ క్రమంలోనే నాగరాజు తన భార్యను కొట్టడమే కాకుండా, పురుగుమందు తాగడానికి యత్నించాడు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో లక్ష్మి, బాలుడిపై పురుగుమందు పడింది. చివరకు నాగరాజు ఆవేశంలో భార్య గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు బాలుడు జరిగిన విషయాన్ని తన పెదనాన్న గంగాధర్‌కు తెలపడంతో, ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నాగరాజుకు మద్యపానం అలవాటు ఉందని, ఆ మత్తులో తరచూ భార్యతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆవేశంలోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉంటారనుకున్న దంపతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ గ్రామంలో విషాదం నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -