ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని పొట్టిపాడులో మౌలిక వసతుల పనుల నాణ్యతపై రాజకీయ రచ్చ మొదలైంది. ఇక్కడ జరుగుతున్న సిమెంట్ రోడ్డు కాంట్రాక్టు పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పొట్టిపాడులో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ఈ పనులను సింగిల్ టెండర్ విధానంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు దక్కించుకున్నారని రాచమల్లు ఆరోపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకే వచ్చిన పగుళ్లను ఆయన స్వయంగా చాక్ పీసులతో మార్క్ చేసి, పనుల్లో ఉన్న లోపాలను మీడియా మరియు స్థానిక ప్రజలకు వివరిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచమల్లు బావమరిది బంగారు రెడ్డి కూడా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రోడ్డును పరిశీలిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే….ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి మరియు సదరు కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి తమ వర్గీయులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. కాంట్రాక్టు పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పనులు నాణ్యతతోనే సాగుతున్నాయని టీడీపీ నేతలు గట్టిగా వాదించారు.
ఒకవైపు ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డిలు ఒకరినొకరు హెచ్చరించుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరుపార్టీల కార్యకర్తలు భారీగా తరలిరావడంతో నెట్టరింతలు, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని గమనించిన పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను వారించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, పోలీసులు స్వల్పంగా బలప్రయోగం చేశారు. రెండు గ్రూపులను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
