- Advertisement -

ఆగ్రాలో దారుణం.. కన్నతల్లికే విషం పెట్టిన కొడుకు!

- Advertisement -

ఆగ్రాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. భార్యను తిరిగి పంపాలన్న అత్త షరతుకు తలొగ్గి, కన్నతల్లికే విషం పెట్టి చంపాలని ప్రయత్నించాడు ఒక కొడుకు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఆగ్రా జిల్లా పిధౌరా పరిధిలోని బర్పురా గ్రామానికి చెందిన రవీంద్రకు, తన తమ్ముడు ముకేశ్‌తో భూ వివాదం నడుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో రవీంద్ర భార్య అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు రవీంద్ర అత్తింటికి వెళ్లాడు. అక్కడ అతని అత్త ఫూల్వతి వింతైన, అమానుషమైన షరతు పెట్టింది. “నా కూతురిని నీకు తిరిగి పంపాలంటే, ముందుగా నీ తల్లిని చంపేయాలి” అని ఆమె తెగేసి చెప్పింది. అంతేకాదు, తల్లి తినే శనగ కూరలో విషం కలిపి ఆమెను అంతమొందించాలని రవీంద్రకు సూచించింది.

అత్త మాటలు నమ్మిన రవీంద్ర, కన్నతల్లి పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా ఇంటికి చేరుకున్నాడు. అత్త చెప్పినట్లుగానే శనగ కూరలో విషం కలిపి తన తల్లికి తినిపించాడు. కాసేపటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో, గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సహాయ పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ మీడియాకు వెల్లడించారు. రవీంద్ర అత్త ఫూల్వతి ఈ దారుణానికి ప్రేరేపించినట్లు గుర్తించామని, ఆమె ప్రస్తుతం పరారీలో ఉందని తెలిపారు. ఫూల్వతిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఏసీపీ పేర్కొన్నారు. కన్నతల్లిని చంపేందుకు సిద్ధపడిన కొడుకు, అందుకు ప్రేరేపించిన అత్త తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -