విశాఖపట్నం తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతై మృతిచెందిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఈ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక మత్స్యకారుడు ‘కారి చిన్న’ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జబ్బర్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలు ప్రమాదం అనంతరం ఎదుర్కొంటున్న కష్టాలను, తమ ఆవేదనను వైయస్ జగన్‌కు వివరించాయి. వారి బాధలను ఓర్పుగా విన్న ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బోటు ప్రమాదం నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, రక్షణ చర్యల వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, మత్స్య కారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జులై 4న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు మరణించారని జగన్ ఆరోపించారు. పార్టీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్దిక సాయం ప్రకటించారు. వైసీపీ హయాంలో మత్య్సకారుల కోసం పది ఫిషింగ్ హార్బర్ లను నిర్మించామని జగన్ గుర్తు చేసారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనతో ఉన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని.. తిరిగి మత్య్సకారుల కోసం అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు.
