అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పవిత్రమైన పంచదారల కొండ మైనింగ్ వ్యవహారంపై స్పందిస్తూ, ఎంపీ సీఎం రమేష్ తీరును ఎండగట్టారు.సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, “సిఎం రమేష్ అంటేనే ‘కరప్షన్ మ్యాన్ రమేష్'” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, పంచదారల కొండ ప్రాంత ప్రాముఖ్యతను మరియు అక్కడ జరుగుతున్న మైనింగ్ ప్రయత్నాలను ప్రస్తావించారు.
గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని మింగేసే రకంగా అనకాపల్లి ఎంపీ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.సీఎం రమేష్.. నువ్వు శివునితో పెట్టుకున్నావ్. ఆ పరమశివుడు మూడో కన్ను తెరిస్తే నీ అక్రమాలు అంతమైపోవడం ఖాయం అని తీవ్రంగా హెచ్చరించారు.
పంచదారల కొండ రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఒక్క తట్ట మట్టి కూడా తీయనివ్వం: పంచదారల కొండపై ఒక్క తట్టెడు మట్టిని కూడా తీయడానికి ఒప్పుకునేది లేదని, మైనింగ్ ప్రయత్నాలను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సదరు ప్రాంతాన్ని తక్షణమే ‘నో మైనింగ్ జోన్’ (No Mining Zone) గా ప్రకటించే వరకు స్థానిక ప్రజలు మరియు వైఎస్సార్సీపీ తరఫున పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రజాప్రతినిధులు వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారంటూ అమర్నాథ్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
