కర్ణాటకలోని బెంగళూరులో మహిళల భద్రతపై మరోసారి చర్చనీయాంశమైన ఘటన వెలుగుచూసింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని లైంగికంగా వేధించిన ఆకతాయికి, బాధితురాలు అత్యంత ధైర్యంగా దీటుగా బదులిచ్చింది. ప్రయాణికుల ముందే అతడికి దేహశుద్ధి చేసి, డ్రైవర్ సాయంతో పోలీసులకు అప్పగించింది.
బెంగళూరులోని హెబ్బల్ నుంచి మాన్యతా టెక్ పార్క్ వైపు వెళ్తున్న ఓ సిటీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజువారీ ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఆ బస్సులో ఓ యువతి ప్రయాణిస్తోంది. అదే బస్సులో ఎక్కిన ఓ కామాంధుడు.. తోటి ప్రయాణికురాలైన ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అయితే, ఆకతాయి చేసిన పనికి ఆ యువతి ఒక్కసారిగా షాకైనప్పటికీ, ఏమాత్రం భయపడకుండా తీవ్రంగా ప్రతిఘటించింది. బస్సులోనే అందరి ముందూ నిందితుడిని చెంపదెబ్బలు కొడుతూ చితకబాదింది. తోటి ప్రయాణికులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. వెంటనే బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేసి జరిగిన విషయాన్ని వివరించింది.
యువతి ధైర్యాన్ని, ఆకతాయి ప్రవర్తనను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. బస్సులోని ఇతర ప్రయాణికులు కూడా ఆ ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. అనంతరం బస్సును నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. రద్దీగా ఉండే బస్సులోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, ధైర్యంగా నిలదీసిన యువతిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
