కర్ణాటకలో పదేళ్ల నాటి కక్షతో జరిగిన దారుణ హత్య స్థానికులను షాక్కు గురిచేసింది. సుమారు 10 సంవత్సరాల క్రితం తన తల్లితో పారిపోయిన వ్యక్తిపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి, చివరకు అతడిని అతి క్రూరంగా హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు బాధితుడి మృతదేహంపై కాలు పెట్టుకుని అక్కడే నిలబడి, పోలీసులు వచ్చే వరకు ఎదురు చూసిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటన సోమవారం సాయంత్రం యెల్లమ్మ ఆలయానికి ప్రసిద్ధి చెందిన సావదట్టి తాలూకా హూలికట్టి గ్రామ సమీపంలో జరిగింది. బాధితుడు బసప్ప హోస్మని (51), బసదోని గ్రామానికి చెందిన వ్యక్తి. నిందితుడు ఎరయ్య మాథపాటి రోడ్డుపై వెళ్తున్న హోస్మనిని అడ్డగించి, పదునైన ఆయుధంతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. హోస్మని శరీరంపై సుమారు 16 కత్తిపోట్లు ఉండగా, ఘటన స్థలంలోనే మృతి చెందాడు.
అయితే ప్రతీకారం అక్కడితో ఆగలేదు. సినిమాని తలపించేలా, రక్తంతో తడిసిన తెల్లటి బనియన్ వేసుకుని, మాథపాటి హోస్మని మృతదేహంపై కాలు పెట్టి నిలబడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో చూస్తుండగానే, అతడు అక్కడే ఉండిపోయాడు. ఇది అతడు పదేళ్లుగా పెంచుకున్న కక్షకు నిదర్శనంగా మారింది.
హత్య చేసిన అనంతరం నిందితుడే పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, 2016లో హోస్మని మాథపాటి ..తల్లితో పారిపోవడంతో అతని కుటుంబానికి అవమానం జరిగిందని భావించి, నిందితుడు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. ఆ ఘటన తర్వాత హోస్మని కొల్హాపూర్లో స్థిరపడి, ఇటీవలే సావదట్టికి తిరిగి వచ్చాడు.
హోస్మని తిరిగి వచ్చిన విషయాన్ని గమనించిన మాథపాటి, అతడిని హత్య చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆ ప్రణాళికను అమలు చేశాడు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు, అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
