ఆస్తి వివాదం కారణంగా వదినను అంతం చేసి మొత్తం ఆస్తిని తన పేరున మార్చుకోవాలనుకున్న ఓ మరిది పన్నిన కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి సుపారీ కిల్లర్‌ను రప్పించి హత్యాయత్నానికి పాల్పడిన ప్రధాన నిందితుడితో సహా అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రాములు శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య ఉమ్మడిగా ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా, ఉమ్మడి ఇంటిని సైతం తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కక్షతో శంకర్ గతంలోనూ తన అన్న, వదినలైన రాజం, లక్ష్మిలపై రెండుసార్లు దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఎలాగైనా ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని భావించిన శంకర్.. తన భార్య అనూష, బంధువు ముత్తన్నతో కలిసి వదిన గోనెల లక్ష్మిని హత్య చేయడానికి పక్కా పథకం రచించాడు.
ఈ హత్య కోసం తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను శంకర్ సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్ వెళ్లి ఓ అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీనికోసం శంకర్ ఫోన్ పే ద్వారా సచిన్‌కు రూ. 35 వేలు పంపించాడు. మెట్‌పల్లికి తిరిగి వచ్చిన సచిన్.. గత నెల 13న లక్ష్మిని హతమార్చేందుకు ఆమె ఇంటికి వెళ్లినా, భయాందోళనకు గురై కాల్పులు జరపకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
అయినా వదలని నిందితులు మళ్లీ గత నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత సచిన్‌ను బైక్‌పై పంపించారు. ఇంట్లోని ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై సచిన్ నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఆమె ఎడమ చెంప భాగంలో తగిలింది. భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. అంతేకాకుండా సచిన్‌ను వెంటనే ఉత్తరప్రదేశ్‌కు పంపించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.
అయితే బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరుసటి రోజే శంకర్, ముత్తన్నను.. ఆ తర్వాత ఈ నెల 28న అనూషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం శరీరం నుంచి బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 20న ప్రత్యేక బృందంతో ప్రయాగ్‌రాజ్ వెళ్లి సచిన్‌వర్మను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టల్, రెండు బుల్లెట్లు, బైక్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్‌లను డీఎస్పీ అభినందించారు.
