భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సరికొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, ఇప్పుడు మైదానంలో కాకుండా మైక్ ముందు సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీమ్ఇండియా తరఫున పదిహేనేళ్లపాటు అద్భుతమైన సేవలు అందించిన రహానే, ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం కలిగి ఉన్నారు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆయన ఏ రంగం వైపు అడుగుపెడతారనే దానిపై ఉన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది.
మరో మూడు రోజుల్లో భారత్ – శ్రీలంక జట్ల మధ్య ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ద్వారా రహానే కామెంటేటర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రహానేతో పాటు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్స్ సీఆర్వో, బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టులు పెట్టారు. తమ కామెంట్రీ ప్యానల్లోకి రహానేను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు రాజేష్ కౌల్ తెలిపారు.
ఈ సందర్భంగా అజింక్య రహానే తన భావాలను పంచుకుంటూ.. ‘‘భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌తో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేస్తుండటం నాకు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. క్రికెట్లో టెస్టు ఫార్మాట్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత్ తరఫున నేను ఎన్నో సంవత్సరాలు టెస్టు మ్యాచ్‌లు ఆడాను. ఇప్పుడు ఆటను మైదానంలో కాకుండా మరో కోణంలో చూడబోతున్నా. నా సుదీర్ఘ అనుభవాలు, ఆటలోని కీలక మలుపులను విశ్లేషిస్తూ అభిమానుల ముందుకు తీసుకొస్తా. మైదానంలో నన్ను ఆదరించినట్టే, నా కొత్త బ్రాడ్కాస్ట్ జర్నీని కూడా ఫ్యాన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలె వేదికగా ప్రారంభం కానుంది. అలాగే, ఆగస్టు 23 నుంచి మొదలయ్యే రెండో మరియు ఆఖరి టెస్టు మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. సుదీర్ఘకాలం పాటు భారత టెస్టు జట్టుకు వెన్నెముకగా నిలిచిన రహానే.. ఇకపై మ్యాచ్‌లను తన మాటల విశ్లేషణతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నారు.
