తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో (TPCC) వర్గపోరు మరోసారి భగ్గుమంది. పార్టీ అధిష్టానం, నాయకత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్టీలో క్రమశిక్షణే ప్రధానమని, గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ చీఫ్ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అంతే తీవ్రంగా స్పందించారు. తనకు నీతులు చెప్పే బదులు ముందు సీఎం రేవంత్ రెడ్డికి నీతులు చెప్పాలని ఘాటుగా బదులిచ్చారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగడం వల్లే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతోందని ఆయన ఆరోపించారు. దానం నాగేందర్ లాంటి నాయకులను చూస్తే ప్రజలకు రాజకీయ నాయకుల మీద ఉండే నమ్మకం, గౌరవం పూర్తిగా పోతుందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి, మళ్లీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని దానం చెప్పడం ఏ రకమైన చిల్లర రాజకీయం అంటూ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా, సీఎం రేవంత్ రెడ్డి సహా ఎవరినైనా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ వేదికలను విడిచిపెట్టి బహిరంగంగా విమర్శలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పటికే ఏఐసీసీ (AICC) ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే చర్చిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మధ్యే ఈ స్థాయి బహిరంగ విమర్శలు తలెత్తడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కాస్త ఆలోచించి పార్టీకి నష్టం కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. అయితే, ఎన్నికల వేళ అధికార పార్టీలో సాగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
