నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కీలక విషయాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి దొంగతానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో గోడదూకి ఇంట్లో ప్రవేశించి చోరీకి పాల్పడిన విద్యార్థిని రూపారెడ్డి గుర్తించడంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేశాడన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.
స్కూల్‌లో ఫీజుల వసూళ్లు జరుగుతుండటంతో ప్రిన్సిపల్ ఇంట్లో భారీగా డబ్బు ఉంటుందని నిందితులు భావించారు. ఐదు రోజుల ముందు నుంచే ఇంట్లో చోరీకి ప్లాన్ వేసుకున్నారు. ఈ హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సుమారు 70 సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఆధారంగానే పారిపోతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి చివరిసారిగా తన పిన్నితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ‘బాబు’ అనే పదం వాడారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టి స్కూల్‌లో విచారణ జరిపారు.
హత్య తర్వాత నాలుగు రోజులు స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. రీఓపెన్ తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల గురించి పోలీసులు ఆరా తీశారు. వారిలో ఐదుగురు పదోతరగతి విద్యార్థులు ఉన్నట్లు తేలింది. అందులో ఇద్దరు విద్యార్థులు గత కొన్ని రోజులుగా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు. ఆ నోట్లపై రక్తపు మరకలు ఉండటంతో ల్యాబ్‌కు పంపగా మనిషి రక్తంగా తేలింది.
నిందితుల్లో ఒకడు అదే స్కూల్ హాస్టల్‌లో ఉండేవాడు. గతంలో అతడి బ్యాగ్‌లో డబ్బు, సెల్‌ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించి డేస్కాలర్‌గా మార్చారు. ఆ కోపంతోనే ఆమెపై కక్ష పెంచుకున్నాడు. జల్సాల కోసం గోడదూకి లోపలికి వెళ్లగా ప్రిన్సిపల్ గుర్తుపట్టడంతో 27 సార్లు కత్తితో పొడిచి చంపాడు. నిందితులు మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
