ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ స్పష్టంగా చెప్పింది. అయినా సరే కూటమి ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం ఆపడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఈ సందర్భంగా ఆయన ఓపెన్ చాలెంజ్ విసిరారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ చంద్రబాబు హయాంలోనే విడుదలైందని జగన్ గుర్తుచేశారు. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయని చెప్పారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే తమ హయాంలో మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ స్వయంగా తేల్చి చెప్పిందని వెల్లడించారు. వాల్యూయేషన్‌లో కూడా ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టమైందన్నారు. అయినా ప్రతిసారీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీపీఎస్సీలో తాము విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని జగన్ చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. బాబు హయాంలో రెస్పెక్టివ్ పరీక్షల్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. మొత్తం 78 నోటిఫికేషన్ల ద్వారా 6,296 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. తమ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణైనా వచ్చిందా అని నిలదీశారు.
తమ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1 పరీక్షలపై సీబీఐ దర్యాప్తునకు తాను సిద్ధమని జగన్ ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన 2025 డీఎస్సీ పరీక్షలపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
