- Advertisement -

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మరోసారి వీవీఎస్ లక్ష్మణ్!

- Advertisement -

మరో రెండు వారాల్లో ఆసియా క్రీడలు (Asian Games 2026) ప్రారంభం కానున్నాయి. జపాన్ వేదికగా జరగనున్న ఈ మహా సంగ్రామంలో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత జట్టుతోపాటు కోచ్‌గా వెళ్లేందుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు మరోసారి అవకాశం దక్కింది. కేంద్ర క్రీడల శాఖ ఇందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ జాబితాలో లక్ష్మణ్ పేరు ఖరారైంది.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. దాదాపు ఇదే సమయంలో వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్‌ ఆడనుంది. అందుకే గంభీర్ స్వదేశంలోనే ఉండి ఆ సిరీస్‌ను పర్యవేక్షిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా క్రీడలకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించడం ఇది వరుసగా రెండోసారి. 2023లో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్రీడలకు కూడా లక్ష్మణే కోచ్‌గా ఉన్నారు. అప్పట్లో ఆయన మార్గదర్శకత్వంలోనే టీమ్‌ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసి బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత కూడా గంభీర్ అందుబాటులో లేని పలు సిరీస్‌లకు లక్ష్మణే హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.

ఈసారి ఆసియా క్రీడల కోసం లక్ష్మణ్ తన కోచింగ్‌ బృందాన్ని ప్రకటించారు. మాజీ క్రికెటర్లు సునీల్ జోషి, హృషికేశ్‌ కనిత్కర్, శుభదీప్‌ ఘోష్‌కు ఈ సపోర్ట్ స్టాఫ్ జాబితాలో చోటు దక్కింది. అలాగే మరూఫ్‌ ఫజందార్‌ను టీమ్‌ లీడర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, తెలుగు తేజం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీతో పాటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా చోటు దక్కించుకున్నారు. ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతున్న అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.

మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఆసియా క్రీడలకు సిద్ధమైంది. హెడ్‌ కోచ్ అమోల్ ముజుందార్‌, బౌలింగ్ కోచ్ అవిష్కార్ సాల్వి నేతృత్వంలోనే భారత అమ్మాయిల జట్టు ఈ టోర్నీ బరిలోకి దిగనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. త్వరలోనే ఈ జట్లు జపాన్‌కు పయనం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -