తెలంగాణాలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కొత్త పార్టీని స్థాపించిది ఎవరో కాదు తెలంగాణా ఉద్యమంలో సకలజనుల సమ్మెలో ప్రముఖ పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఆయన స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీకి ఇటీవల ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడంతో సోమవారం ఆయన అధికారికంగా ప్రకటన చేశారు.
టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు.
ఈనెల 29న హైదరాబాద్‌లో టీజేఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తామన్నారు. ఆవిర్భావ సభ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం ఉద్యమం సాగిందని.. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందని కోదండరాం అన్నారు. ప్రజాస్వామిక విలువకు కూడా గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థకూ గౌరవం లేదని.. అన్ని నిర్ణయాలు సచివాలయం నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. అధికారపార్టీ టీఆర్ఎస్‌కు ఏమేరు గట్టిపోటీ ఇస్తుందనేది తేలనుంది.
