ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పనిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైనా అధికారపార్టీలోకి వెల్లడానికి నేతలు ఉత్సాహం చూపుతారు. కాని రాష్ట్రంలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారపార్టీకి చెందిన నేతలే కాదు.. మిగిలిన పార్టీకి చెందిన నేతలు సైతం అధికారపార్టీ వైపు కాకుండా విపక్ష పార్టీలో చేరేందుకు తెగ ఉబలాట పడుతున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీ కండువా కప్పుకొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, బిజెపి నుండి సస్పెండ్ అయినా నేదురుమల్లి రామకుమర్ రెడ్డి సెప్టెంబర్ మొదటి వారంలో చేరనున్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో పాదయాత్రలో ఉన్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ వర్ధంతి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈదే రోజున విశాఖలో పార్టీ కండువా కప్పుకొనేందుకు ఆనం సిద్ధమవుతున్నారు. తర్వాత మరికొద్ది రోజుల్లోనే అంటే సెప్టెంబర్ రెండో వారంలోగానే నేదురుమల్లి కూడా ఉత్తరాంధ్ర వేదికగానే వైసిపిలో చేరనున్నారు.
మొత్తానికి ఇద్దరు ప్రముఖ నేతలు వైసిపిలో చేరుతుండటంతో పార్టీ మరింత బలోపేతమవుతోంది. అయితే ఇక్కడే జగన్కు పెద్ద సమస్యగా మారింది. ఇద్దరు కూడా వెంకటగిరినుంచి బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతుండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో జగన్కు అర్థం కావడంలేదు. మరి, టిక్కెట్టు ఎవరికి వస్తుందో చూడాల్సిందే.
