ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో కూడ కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. దీనిలో భాగంగా జనసేన పార్టీకీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ్మినేని లేఖపై జనసేన ప్యాక్ కమిటీ చర్చించింది.
జనసేన పార్టీలోని తెలంగాణ నేతలతో కలసి ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ లేఖ రావడంతో సీపీఎం నేతలతో ముఖాముఖి చర్చించాలని ప్యాక్ నిర్ణయించినట్టు పేర్కొంది. సీపీఎమ్ నేతలను పార్టీ కార్యాలయానికి ఆహ్మానించి చర్చలు జరపాలని జనసేన నిర్ణయించింది.
వచ్చే ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఎఫ్ తరుపునే పోటీ చేయనుంది. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగట్టేందుకు గాను సీపీఎం ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగానే జనసేనతో తమ్మినేని ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీల మధ్య పొత్తులు, కూటములు ఏర్పాటయ్యే అవకాశం కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘జనసేన’తో కలసి పని చేయడం ప్రజా సమస్యల పరిష్కారంలోనా? లేక వచ్చే ఎన్నికలలో కలసి పోటీ చేయడానికా? అన్న విషయాలపై స్పష్టత అవసరమని ప్యాక్ అభిప్రాయపడినట్టు స్పష్టం చేసింది. సీపీఎం నేతలను ‘జనసేన’ పార్టీ కార్యాలయానికి ఆహ్వానించాలని ప్యాక్ నిర్ణయించిందని, సీపీఎం నేతలతో సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదికను సమర్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.
