- Advertisement -

వంగవీటి చూపు జనసేన వైపు

- Advertisement -

కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిప్పు రాజుకుంది. ఎవరుంటారో ? ఎవరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తారో ? తెలియని పరిస్థితి తలెత్తింది. అయితే నాయుకులు సింపుల్ గా పార్టీలు మారితే పర్వాలేదు. రాజకీయాలు అన్నాక అవి కామన్ అని జనం సర్ధిచెప్పుకుంటారు. కానీ అధిష్టానం ఆదేశాలు, నేతల రెచ్చగొట్టే ఉపన్యాసాలు, అనుచరుల ఆవేశకావేశాలు, ముఖ్య నేతల కీలక నిర్ణయాలు ఎలా ఉంటాయో ? ఎటు నుంచి ఎటు తిరిగి ఎలాంటి వాతావరణం సృష్టిస్తాయో అనే ఆందోళన సామాన్య ప్రజల్లో నెలకొంది. నిన్నమొన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న కృష్ణా తీరం ఇప్పుడు రాజకీయ అలజడి రేపుతోంది. దానికి ప్రధాన కారణం జిల్లాలోని పార్టీ నేతలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల సర్దుబాటులో మనస్పర్ధలే. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో అంతర్గత పోరు బహిర్గతమవుతోంది. అలకలు మొదలయ్యాయి. ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. శపథాలు తొడగొడుతున్నాయి. నేతల వ్యూహాలు మారుతున్నాయి. ఆశించిన టికెట్ రాదని తేలిపోవడంతో పక్క పార్టీవైపు చూపులు మొదలయ్యాయి.

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి, ఆ సీటు సంగతి మల్లాది విష్ణుకు వదిలేసి, తనను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీకి సిద్ధపడాలన్నది ఆ ఆదేశాల సారాంశం. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నా రాధా తాను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికిట్ ఆశించే ఇన్నాళ్లూ కష్టపడ్డానని, ఆ నియోజవర్గం పరిధిలో చాలా ఖర్చు పెట్టడం, ప్రజలతో మమేకమవుతూ కష్టపడటం జరిగాయని చెప్పుకున్నారు. ఇప్పుడు సడెన్ గా మచిలీపట్నం ఎంపీ స్థానం అంటే ఎలా ? అని పార్టీ పెద్దల సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. ఆయన అంతలా కోరుతున్న విజయవాడ సెంట్రల్ టికెట్ మల్లాది విష్ణుకు కేటాయించినట్లు తెలుస్తోంది. నేటి నుంచి ఆ నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. దీంతో వంగవీటి రాధా అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. అంటే నిర్ణయం ముందే తీసుకుని, ఇప్పుడు తనకు పార్టీ నుంచి పొమ్మనక పొగబెడుతున్నారా ? లేకపోతే నియోజకవర్గంలో కార్యక్రమాల గురించి కూడా ముందే మల్లాదికి చెప్పేసి, ఇప్పుడు సడెన్ గా తనకు మచిలీపట్నం ఎంపీ స్థానమంటే…అర్థమేంటని ఆయన మండిపడుతున్నారు. తన అనుచరులతో కలసి భవిష్యత్ పై చర్చలు జరుపుతున్నారు.

ఇక ఆయన జనసేనలో జాయిన్ అయిపోతారనే టాక్ విజయవాడలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వంగవీటి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేసేశారు. ఫ్యాక్స్ ద్వారా ఆయన లేఖను జగన్ కు పంపించారు.

అయితే రాధా పార్టీ మారిపోతారని, కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో వైఎస్ఆర్ సీపీలోని కొందరు సీనియర్లు అతడిని బుజ్జగించే పనిలో పడ్డారు. విజయవాడ సెంట్రల్ కాకపోతే ఏముంది ? విజయవాడ ఈస్ట్, అవనిగడ్డ, లేదంటే మచిలీపట్నం అసెంబ్లీ స్థానాలు అడుగుదాం, అని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన విజయవాడ సెంట్రల్ తప్ప మరో ఆలోచన లేదని తేల్చి చెప్పారు. దీంతో పార్టీ పెద్దలతో మరోసారి మాట్లాడి స్పష్టత తీసుకునే వరకూ ఆగాలని, తొందరపడి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని రాధాకు సీనియర్లు చెప్పారు. కానీ ఆయన అధిష్టానం తనపట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావించట్లేదని, అలా అయితే ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు కాదని మండిపడ్డట్టు సమాచారం. మొత్తానికి పార్టీ సీనియర్లకు కొంత గడువు ఇచ్చిన ఆయన, జగన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అభీష్టం నెరవేరకపోతే జనసేనలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -