తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటి వరకూ బాగా వినిస్తున్న డిమాండ్లలో ఒకటీ… హైకోర్టు విభజన. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వీలైనంత త్వరగా విభజిస్తే న్యాయపరంగా కేసుల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందని తెరాస సర్కారు కూడా పలుమార్లు అభిప్రాయపడింది. తెలంగాణ న్యాయవాదు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టును త్వరగా విభజన చేస్తే కేసుల విభజన కూడా జరుగుతుందనీ ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని వారూ అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పట్లో హైకోర్టు విభజన సాధ్యమయ్యేలా లేదు!
కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే హైకోర్టు విభజనకు ఇంకా చాలా సమయం పట్టేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుందని ఆయన అన్నారు. అయితే, ఆంధ్రాలో ఇంకా కోర్టుకు సంబంధించి ఏర్పాట్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఏపీకి వెళ్లాలంటే అక్కడ కొన్ని మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుందని మంత్రి సదానంద అభిప్రాయపడ్డారు.
కేంద్రమంత్రి అభిప్రాయం ఇలా ఉంటే… హైకోర్టు భవన ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబు సర్కారు ఏ ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం అమరావతిలోని తాత్కాలిక సచివాలయ ఏర్పాటు హడావుడిలోనే బాబు సర్కారు తలమునకలై ఉంది. అది పూర్తయితే తప్ప హైకోర్టు గురించి వారు పట్టించుకునే పరిస్థితి లేదనే అనుకోవాలి. అయితే, హైకోర్టు కోసం ఒక ప్రత్యేకమైన డిజైన్ సిద్ధం చేస్తున్నామని ఏపీ సర్కారు అంటోంది. ఇంతకీ ఆ డిజైన్ ప్రకారం నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం రెండుమూడేళ్లు ఈజీగా పట్టొచ్చు. ఈ లెక్కన ఇప్పట్లో హైకోర్టు విభజన సాధ్యమయ్యేలా లేదు. న్యాయవాదులూ టి.సర్కారు డిమాండ్ చేస్తున్న హైకోర్టు విభజన ఇప్పట్లో అయితే సాధ్యం కాదనే చెప్పుకోవాలి!
